ఢిల్లీ అగ్ని ప్రమాదం.. వంటమనిషి చేసిన తప్పే అంతమంది ప్రాణాలు తీసిందా?

  • ఢిల్లీ హోటల్ ప్రమాదంలో వంటమనిషి అరెస్ట్
  • స్టవ్ పేలడంతో పవర్ ఆఫ్ చేసిన కేశవ్‌ నేగి
  • కరెంట్ పోవడంతో లాక్ అయిన ఎలక్ట్రానిక్ తలుపులు
  • బయటకు రాలేక 21 మంది మృతి
  • విచారణ ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా వంటమనిషి కేశవ్ నేగిని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. కిచెన్‌లో మంటలు అంటుకోగానే కేశవ్ చేసిన ఓ పెద్ద పొరపాటే ఇంతమంది మరణానికి దారితీసిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం కేశవ్‌ కిచెన్‌లోని ఎలక్ట్రిక్ స్టవ్‌ను ఆన్ చేయగానే అది ఒక్కసారిగా పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కేశవ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయకుండా.. హోటల్ ‘మెయిన్ పవర్ స్విచ్’ను పూర్తిగా ఆఫ్ చేసి దట్టమైన పొగ నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగు తీశాడు.

అయితే కేశవ్‌ పవర్ సప్లైని నిలిపివేయడంతో హోటల్‌లోని ఎలక్ట్రానిక్ సెన్సార్ తలుపులు అన్నీ జామ్ అయి శాశ్వతంగా లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఉన్న అతిథులు బయటకు రావడానికి మార్గం లేక గదుల్లోనే చిక్కుకుపోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ఓ గదిలోని భార్యాభర్తలు బాత్‌రూమ్ డోర్ లాక్ అయిపోవడంతో బయటకు రాలేక లోపలే ఊపిరాడక విగతజీవులుగా మారారు.

ఐదంతస్తుల ఉన్న ఈ ఇరుకైన హోటల్ భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. కానీ, ద్వారం మాత్రం ఒకటే ఉండడం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి ఉండటం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 2022 తర్వాత దేశ రాజధానిలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా నమోదైన ఈ ఘటనపై పోలీసులు హోటల్ సిబ్బందితో పాటు ఇతరులను విచారిస్తున్నారు.

Delhi Fire Accident
Keshav Negi
Lavkesh Bajaj
Delhi Hotel Fire
Electric Stove Explosion
Electronic Sensor Doors
Delhi Police Investigation
Fire Safety Negligence
Delhi Fire Tragedy

More Telugu News